టిఆర్ఎస్ గాలిలో రేవంత్ రెడ్డి సహా కొట్టుకుపోయిన ప్రముఖులు.

మహా కూటమిలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా పేరుపొందిన రేవంత్ రెడ్డి పరాజయం పాలయ్యారు. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 9500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా మొదటి రౌండ్‌ నుంచి వెనకబడి ఉన్న రేవంత్ ఏ దశలోనూ అందుకోలేకపోయారు.

కొడంగల్ లో తను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ సవాల్ కూడా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఢీ కొట్టే స్థాయి ఉన్న నేతగా పేరు పొందిన రేవంత్ రెడ్డి ఓటమి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చే అంశమే.

ఇక టిఆర్ఎస్ గాలిలో పలువురు కాకలు తీరిన కాంగ్రెస్ యోధులు కూడా మట్టి కరిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, డీకే అరుణ, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, సర్వే సత్యనారాయణ, వంశీచంద్‌ రెడ్డి, జీవన్‌ రెడ్డి, నాగం జనార్దన్‌ రెడ్డి, విష్ణువర్థన్‌ రెడ్డి, ఆర్ కృష్ణయ్యలతోపాటు ఉత్తమ్ భార్య పద్మావతి కూడా ఓటమి చెందారు. సునితా లక్ష్మారెడ్డి సబితా ఇంద్రారెడ్డి కూడా ఇదే లిస్ట్ లో ఉన్నారు.

ఇక టీడీపీ నుంచి నందమూరి సుహాసినితో పాటు నామా నాగేశ్వరరావు, భవ్య భవానీ ప్రసాద్ ఓడిపోగా అధికార టిఆర్ఎస్ నుంచి కూడామాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులతో పాటు చందూలాల్‌ ఓటమి చవి చూసారు.