కేసీఆర్, కేటీఆర్ లకు అభినందనలు.. పవన్ కళ్యాణ్.

తెలంగాణ ఎన్నికల్లో అవినీతి తక్కువగా ఉండి, ప్రజల ఆకాంక్షలను తీర్చే పార్టీకే ఓటు వేయమంటూ పిలుపునిచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన టిఆర్ఎస్ పార్టీకి అభినందనలు తెలియజేశారు.

‘తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కేసీఆర్ గారికి నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున హృదయపూర్వక శుభాభినందనలు” తెలుపుతూ పవన్‌‌ జనసేన పార్టీ తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. “ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది. త్యాగాలు చేసి తెలంగాణను తెచ్చిపెట్టిన టిఆర్ఎస్ కు, ఆ పార్టీ నాయకుడు కేసీఆర్‌కు ప్రజలు పట్టం కట్టి తమ మనసులోని మాటను మరోసారి చాటి చెప్పారని” ఈ అఖండ విజయానికి సారథులైన కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కేసీఆర్‌ నెరవేరుస్తారన్న నమ్మకం నాలో సంపూర్ణంగా ఉంది. ఈ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన హరీశ్‌రావుకు నా శుభాకాంక్షలు. విజయం సాధించిన ప్రతి ఒక్కరితోపాటు తెరాస నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు’ అని పవన్‌ పేర్కొన్నారు.

పవన్ ఇచ్చిన పిలుపు పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీ గురించేనని భావించిన జనసేన శ్రేణులు టిఆర్ఎస్ గెలుపుకోసం బలంగా పని చేశారని టిఆర్ఎస్ శ్రేణులు కూడా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో పవన్ ప్రకటనపై తెలంగాణలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.