తప్పుల తడక సర్వేతో క్రెడిబిలిటీ కోల్పోయిన లగడపాటి.

ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి సర్వేల పేరు మొత్తం ఒకే ఒక్క సర్వేతో నవ్వుల పాలైంది. తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి అరవై పైచిలుకు స్థానాలు సాధించబోతుంది లగడపాటి చెప్పిన జోస్యం సాధారణ ప్రజానీకం రాజకీయ వర్గాలు గందరగోళానికి గురిచేసింది. పోలింగ్ ముగిసిన అనంతరం జాతీయ సర్వేలన్నీ టిఆర్ఎస్ విజయం సాధిస్తుందని తెలపగా.. లగడపాటి మాత్రం మహాకూటమికి ఛాన్సుందంటూ చెప్పారు. మహాకూటమిలో చంద్రబాబు చేరికతో 25% వోట్ బ్యాంక్ టిఆర్ఎస్ నుంచి కూటమికి వచ్చేసిందని కొత్త కొత్త లెక్కలు చెప్పారు. గతంలో లగడపాటి సర్వేలకున్న క్రెడిబులిటీ దృష్ట్యా సామాన్య ప్రజానీకంతోపాటు రాజకీయ నాయకులు కూడా అయోమయానికి గురయ్యారు.

కానీ ఈ రోజు వెలువడిన ఫలితాల అనంతరం నేషనల్ సర్వేలన్నీ విజయం సాధించగా.. ఇక్కడున్న పరిస్థితులపై మీడియాకు అవగాహన ఉండదంటూ ప్రగల్భాలు పలికిన లగడపాటి సర్వే మాత్రం తలకిందులైంది. లగడపాటి సర్వే ను నమ్ముకుని భారీ పందాలు కాసిన కొంతమంది నేతలు మాత్రం కేసీఆర్ చెప్పినట్టు ఇది లంగా సర్వేనే అంటూ లగడపాటికి శాపనార్ధాలు పెడుతున్నారు.

అయితే లగడపాటి సర్వే చెప్పిన రోజే ఇది తప్పుడు సర్వే అని, కావాలని లగడపాటి చంద్రబాబు ప్రోత్సాహంతో ఇలా చెబుతున్నారు టిఆర్ఎస్ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. మరికొంతమంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయడం కోసమే లగడపాటి ఇలా తప్పుడు సర్వేలు ఇస్తున్నారంటూ విమర్శల వర్షం గుప్పించారు. ఏదేమైనప్పటికీ ప్రజా నాడి కనిపెట్టడంలో పూర్తిగా విఫలమైన లగడపాటి సర్వే లకు ఇక ముందు ఇంకెంత మాత్రం గుర్తింపు ఉండకపోవచ్చు.