సరైన దిశలోనే భారత్… నాలుగో రోజే కీలకం. ఆస్ట్రేలియాతో అడిలైడ్ టెస్టులో భారత్ ముందంజ.

అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ నెమ్మదిగా పట్టుబిగిస్తోంది. ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్లో 235 పరుగులకు ఆలౌట్ చేసి 15 పరుగుల లీడింగ్ తో తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 151 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి మొత్తంగా 166 పరుగుల ఆధిక్యత సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 197 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను మూడోరోజు మరో 45 పరుగులు జోడించిన తర్వాత మిగిలిన మూడు వికెట్లను సాధించి భారత్ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ ప్రారంభించింది.

ఓపెనర్లు కేఎల్ రాహుల్ మురళీ విజయ్ మొదటి ఇన్నింగ్స్లో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని, అనవసర షాట్లకు పోకుండా నిదానంగా ఆడి 50 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. అయితే వారిద్దరూ భారీ భాగస్వామ్యాన్ని మాత్రం నెలకొల్ప లేకపోయారు. లోకేష్ రాహుల్ 44 వద్ద, మురళీ విజయ్ 18 పరుగుల వద్ద వెనుతిరిగారు. అనంతరం ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో పూజారా (40*), కెప్టెన్ కోహ్లీ (34) తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. అయితే మూడవ రోజు మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా కోహ్లీ తన వికెట్ ను లియోన్ కు సమర్పించుకున్నాడు.

ఆట ముగిసే సమయానికి పుజారా (40), రహానె (1) క్రీజులో ఉన్నారు. మిచెల్ స్టార్క్, హజెల్ వుడ్, నాథన్ లియోన్ ఒక్కో వికెట్ చొప్పున సాధించారు. మూడో రోజు మ్యాచ్ లో వర్షం పలుమార్లు ఆటకు అంతరాయం కలిగించింది. అడిలైడ్ పిచ్ చివరి రెండు రోజులు బ్యాటింగ్కు అనుకూలిస్తుందన్నమాజీల వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ నాలుగవ రోజు భారీ ఇన్నింగ్స్ సాధిస్తే భారత్ కు ఈ మ్యాచ్ తో బోణీ లభించే అవకాశం వుంది.