ఓ చట్టమా!!! నీ పరిరక్షకులు ఎక్కడున్నారు! ఆ సరస్వతీపుత్రులకి కాస్త ధైర్యం చెప్పి, జ్ఞాన బోధ చేయమ్మా

ఓ చట్టమా! నలిగిన మల్లెల పచ్చ కన్నీరు చూసి, సోషల్ మీడియాపై మాత్రం రెచ్చి పోతావు;
ఛిద్రమైన జీవితాలనుండి కారుతున్న రక్తకన్నీరును చుస్తున్నాగాని చచ్చుబడిపోతున్నావు
నలిగిన పువ్వులకోసం అలజడులు, పెందుర్ధిలాంటి ఘటనల్లో వివస్త్రలపై మాత్రంమౌనం
పాలకుల పువ్వులపై నీకున్న శ్రద్ధ, దొరల రధ చక్రాల క్రింద నలుగుతున్న ప్రజలపై మాత్రం లేదు
పోరగాళ్లను వెతికి పట్టే చట్టం, సమాజాన్ని పీడిస్తున్న పచ్చ జలగలను చూసి నక్కి నక్కి పోతున్నది
ఎందుకమ్మా నీకా వివక్షత? ఎక్కడమ్మా నీ పరిరక్షకులు? కాస్త వెదికిపెట్టమ్మా

ఓ చట్టమా! లక్షలమంది తునిలో సమావేశం అవుతున్నప్పుడు ఎక్కడా నువ్వు కానరాలేదు;
కానీ రైలు నుండి మంటలు రావడంతోనే ఊడిపడ్డావు. అప్పటివరకు ఎక్కడున్నావు అమ్మా నువ్వు;
దొరలకు, వారి విశ్రాంతి గృహాల్లో నలుగుతూన్న పువ్వులకు నచ్చని పోరగాళ్లందరూ బొక్కలోకి;
నిందితులు మాత్రం, దొరలను దొరల వద్ద నలుగుతూన్న వువ్వుల సేవతో బయటకి;
పాలకులు ఇచ్చే హామీలు నెరవేర్చాలి అనే చట్టం కనుచూపుమేరలో కూడా కానరాదు; కానీ
మీ హామీలు నెరవేర్చండి అనే ముద్రగడని అణచివేయడంలో మాత్రం చట్టం ఉలిక్కిపడి లేస్తుంది
ఎందుకమ్మా నీకా వివక్షత? ఎక్కడమ్మా నీ పరిరక్షకులు? కాస్త వెదికిపెట్టమ్మా

ఓ చట్టమా! పుష్కరాల మృతులకు కారకులెవరో నేటికీ కనిపట్టలేని నువ్వు;
కాల్ మనీ-సెక్స్ రాకెట్టుకి కారకులను, వారు ఎందుకు దొరలతో తిరుగుతున్నారో కనిపట్టలేని నువ్వు;
పంచభూతాలను దేశీయ-విదేశీయ మార్కెటులో అమ్మేసుకొంటుంటే అదుపుచేయలేని నువ్వు
పుణ్య భూమి కమిటీ మెంబర్లు చేస్తున్న దోపిడీని, దౌర్జన్యాలను అదుపుచేయలేని నువ్వు;
సోషల్ మీడియా పోరగాళ్ళని బెదిరిస్తూ, విజగర్వంతో అన్నట్లు వికటాట్టహాసం చేస్తున్నావు
ఎందుకమ్మా నీకా వివక్షత? ఎక్కడమ్మా నీ పరిరక్షకులు? కాస్త వెదికిపెట్టమ్మా!

ఓ చట్టమా! పాలక వర్గాలు దళితులపై చేసిన ఊచకోతలు, మారణకాండలపై మాట్లాడలేని నువ్వు;
సమాజాన్ని ముక్కలుగా విభజించి, అధికారం అనుభవిస్తున్న పార్టీలను ఏమి చేయలేని నువ్వు
హామీలు నెరవేర్చండి అన్నవారిని అణచడంలో పోలీస్ పెరేడ్ చేస్తూ భయోత్పాతం సృష్టిస్తావ్
లారీలతో గుద్దేస్తున్నా, కత్తులతో పొడిచేస్తున్నా కానరాని నువ్వు, నలిగిన పువ్వులకు రక్షణగా ఉంటావ్
కత్తిలాంటి నగ్న ప్రచారాలతో మీడియాలో శీలాపహరణ చేస్తుంటే కానరాని నువ్వు;
నలిగిన పువ్వుల్ని అన్న సోషల్ మీడియాపై మాత్రం విరుచుకుపడతావు
ఎందుకమ్మా నీకా వివక్షత? ఎక్కడమ్మా నీ పరిరక్షకులు? కాస్త వెదికిపెట్టమ్మా

ఓ బ్రహ్మదేవా! చట్టాలను రక్షించాలిన IAS-IPSలు పాలకులకు గులాంగిరి చేస్తుంటే;
చట్టాలను రివ్యూ చేసే న్యాయ వ్యవస్థ నేటికీ సామాన్యునికి అర్ధంకాని బ్రహ్మ పదార్ధగానే ఉంటుంటే;
సామాన్యుల తల రాతలు మార్చడానికి నా దాస్య శృంఖలాలు విడిపించవా అని నువ్వే (చట్టం);
నక్కి నక్కి బిక్కు బిక్కు మంటూ దుర్గమ్మ వారధి లాకులపై నీ కన్నీటిని అదుపుచేసి కొంటుంటే;
ఆ బ్రహ్మ కూడా మా కులపోడే, చట్టం మా చుట్టమే అని పాలకులు మమ్ములను ఎగతాళి చేస్తుంటే;

ఓచట్టమా! సామాన్యుడిని ఇంకెవ్వరు రక్షిస్తారు. ఆలోచించమ్మా! ధైర్యం తెచ్చికొని బయటికి రామ్మా. నీ పరిరక్షకులకు వెతికి, వెతికి పట్టుకొని, వారికి ధైర్యం చెప్పి, కాస్త జ్ఞాన బోధ చేయమ్మా. చట్టం ఒకరికి చుట్టం కాదని నిరూపించుకోమ్మా.

ఆలోచిద్దాం…. ఏది నిజం ఏది అబద్దం

article by:- narayana.I