“దోలేరా సర్” చూద్దాం రా! రా!

అక్షరాలా రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎకరాలు. మేము తింటున్నది కేవలం ముప్పై వేలు ఎకరాలు మాత్రమే అన్నట్లు “గొప్ప టీవీ”లో “గొప్ప స్ఫూర్తి” చేస్తున్న విష ప్రచారము వింటే చాలు ఈ పచ్చ మీడియా సమాజానికి ఎంత ప్రమాదకరమో అర్ధము చేసికోవచ్చు.

“దోలేరా సర్”కి కేంద్రము ఇచ్చిన ప్యాకేజీ ఎంత, ఈ విష ప్రచారము చేయడానికి మన “స్ఫూర్తి” గారికి ఏమైనా ప్యాకేజీలు అందుతాయా అన్నది పక్కన పెడితే, ఈ ప్రచారము చూస్తుంటే మనకి “ఆలీ బాబా అరడజను దొంగలు” కథ గురుతు కొస్తున్నది. అరడజను దొంగలు మన ఆలీ బాబాకి కావాలిసిన వాతావరణాన్ని తమ ప్రచారముల ద్వారా కల్పిస్తూ ఉంటే అప్పుడు మన నిప్పులాంటి ఆలీ బాబా వచ్చి తమ చేతికి మట్టి అంటకుండా తమ పని తాము చేసికొంటూ పోతుంటారు.

ఈ అరడజను పచ్చ టీవీల ప్రచారాలు చూస్తుంటే: నేనొక ఇంటి అద్దె కూడా కట్టలేని సామాన్య ఆంధ్రుణ్ణి అయినప్పుడు, “అంబానీ సారూ” ఇంటిమీద విమానాలు ఆగుతాయి కాబట్టి మనకి కనీసము కారులు ఆగే ఇల్లు అయినా కట్టరూ అనే మన సత్తికాలపు బిడ్డలు గురుతుకొస్తున్నారు..

మన బిడ్డలు చిన్నవాళ్లు కాబట్టి సరిపెట్టుకోవచ్చు. కానీ ఈ తెలివైన జర్నలిస్టులకి ఏమి తక్కువని ఈ విష ప్రచారాలు. కిడ్నీ బాధితులకి తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వము మనది. సీమలో ఉన్న బీడు పొల్లాలని వదిలేసి, మూడు పంటలు పండే పచ్చని పొలాలను రాజధాని చేస్తున్న ప్రభుత్వము మనది.

మన పచ్చని పంటలు పండే పొలాలను రాజధాని పేరుతో విదేశాలకు కట్టబెడుతున్న వైనం మనది. వందల కోట్లు ఖర్చు పెట్టి, గదుల్లోకి నీరు కారే బిల్డింగులు కట్టుకొంటున్న ఫారిన్ టెక్నాలజీ మనది. ఆ లీకేజీలు ఆపడానికి మరొక కాంట్రాక్టర్. వాడి లీకేజీలు ఆపడానికి మరొక కాంట్రాక్టర్. ఇదీ మన సింగపూర్ టెక్నాలజీ.

నాలుగు వసంతాలుగా బంధు, మిత్ర, సకుటుంబ సపరివార సమేతముగా ప్రపంచపు దేశాలు అన్నీ ప్రత్యేక విమానాల్లో తిరిగినా గాని రాజధాని డిజైనులు కూడా ఇంకా తయారు చేసికోలేని హైటెక్ టెక్నాలజీ మనది.

గుజరాతీలు తమ రాష్ట్రములో పెట్టుబడి పెట్టిన తరువాత ఇతర మార్గాలు ఆలోచిస్తుంటారు కానీ మన డబ్బున్న మారాజులు, మన రాష్ట్రములో పెట్టుబడి పెట్టకుండా ఇతర రాష్ట్రాల్లో, మిగిలినది విదేశాల్లో దాచుకుంటుంటారు.

ఇవి అన్నీ వదిలేసి మన మీడియా చేస్తున్న ఈ త్రిశంకు స్వర్గపు ప్రచారాలు ఎవరిని కాపాడడానికి? దేని నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి?

Article by Narayana.I